రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేస్తూ పార్లమెంట్ సెక్రటరీ జనరల్ నిర్ణయం!

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేస్తూ పార్లమెంట్ సెక్రటరీ జనరల్ నిర్ణయం!

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారు. ఎంపీగా ఆయన్ని డిస్ క్వాలిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపేలా కనిపిస్తోంది.

ఇటీవల గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పులో రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం రెండేళ్లు, దానికి మించి జైలు శిక్ష పడిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారు పార్లమెంట్ సభ్యులుగా అనర్హులు. దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి.

కొన్నేళ్ల క్రితం కర్ణాటకలో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మూలం. దేశంలో మోడీలు మోసం చేసి అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని రాహుల్ విమర్శించారు. మోడీ అంటేనే మోసానికి నిదర్శనం అంటూ ఆయన రాజకీయంగా వ్యాఖ్యానించారు. దాన్ని ఆధారంగా చేసుకుని గుజరాత్ కి చెందిన బిజెపి ఎమ్మెల్యే సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మోడీ ఇంటి పేరు ఉన్న వారందరినీ అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. నాలుగేళ్ల విచారణ తర్వాత కోర్టు పిటిషనర్ వాదనను అంగీకరించింది. రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా ఖరారు చేసింది. వెంటనే రాహుల్ తరుపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ ని కోర్టు అంగీకరించి, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది..

రెండు రోజుల క్రితం వెలువడిన ఈ తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేస్తూ పార్లమెంట్ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ వేదిక రాహుల్ గాంధీ చేసిన ఓ ప్రసంగం వివాదాస్పదమైంది. దేశాన్ని కించపరిచేలా ఆయన ఉపన్యాసం ఉందంటూ బిజెపి విరుచుకుపడుతోంది. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అప్పటివరకు పార్లమెంట్లో ప్రసంగించేందుకు కూడా అనుమతించబోమంటూ కొద్దిరోజులుగా సభను స్తంభింప చేస్తున్నారు. తన మాటల్లో ఎటువంటి తప్పిదం లేదని, గతంలో చైనా లో జరిగిన ఒక కార్యక్రమంలో మోడీ చేసిన వ్యాఖ్యల కన్నా తాను ఎక్కువేమీ మాట్లాడలేదంటూ రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ బీజేపీ నేతలు తగ్గలేదు. దానికి తోడు తాజాగా సూరత్ కోర్టు తీర్పు ఆధారంగా హుటాహుటిన ఆయన్ను అనర్హుడిగా ప్రకటించడం చర్చనీయాంసమవుతుంది. బిజెపి అధిష్టానం రాహుల్ గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.. భారత్ జూడో యాత్ర ద్వారా ప్రజల్లో సానుకూల స్పందన రావడంతో రాహుల్ గాంధీకి మోడీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. విషయమేలేని చిన్న కోర్టు కేసు తీర్పు ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ పై వేటు వేయడం సమంజసం కాదని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ పై అనార్హతవేటు వేయడాన్ని నిరసిస్తూ పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేయబోతున్నారు. దాంతో ఆ కోర్టు తీర్పు ఏ మేరకు నిలబడుతుందన్నది ప్రశ్నార్థకం. అయినప్పటికీ దాన్ని పట్టుకుని పొటాహుటిన అనర్హత వేటు వేయడం కేంద్ర ప్రభుత్వ తొందరపాటు చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ తన యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగలిగారు. కాంగ్రెస్ శ్రేణులని ఉత్తేజపరచగలిగారు. దాంతో ప్రధాన ప్రతిపక్షం పుంజుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని బిజెపి విశ్వసిస్తున్నట్టు కనిపిస్తోంది.

రాహుల్ కి ఆరంభంలోనే అడ్డుకట్ట వేసే యత్నంగా ఈ చర్యను భావిస్తున్నారు. భారత జూడో యాత్రకు బిజెపి భయపడుతుందని సంకేతాలు ఇచ్చినట్టుగా ఉందని కొందరు చెబుతున్నారు. రెండో దశ యాత్ర మొదలు అయితే రాహుల్ కి మరింత ఆదరణ తిరిగే అవకాశం ఉందని అంచనాతో ఇలాంటి చర్యలకు పూనుకున్నట్టు చెబుతున్నారు. కేంద్ర బిజెపి నేతల తీరు చూస్తుంటే రాహుల్ యాత్రకు కూడా ఆటంకాలు కల్పించే అవకాశం లేకపోలేదని అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇందిరాగాంధీ విషయంలో కూడా ఇలాంటి అనుభవమే ఉంది. అలహాబాద్ కోర్టులో ఆమె ఎన్నికని రాజ్ నారాయణ సవాల్ చేసినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వెలుబడింది. దాంతో ఇందిరాగాంధీ అప్పట్లో ఎమర్జెన్సీ వరకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఆమె ఓటమి పాలైనప్పటికీ తదుపరి ఎన్నికల్లోనే తిరిగి పుంజుకుని అధికార పీఠాన్ని అధిష్టించారు . రాహుల్ గాంధీ నాన్నమ్మ విషయంలో జరిగిన చరిత్రను గుర్తుచేసేలా ఆయన అనుభవం ఉందని పలువురు అంటున్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *