తెలంగాణలో పంట రుణమాఫీకి రూ.19 వేల కోట్లు విడుదల..
రాష్ట్రంలోని రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీని అందించే పంట రుణాల మాఫీ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తి కాబోతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు . ఈ నెల 2 న ప్రగతి భవన్ లో పంట రుణాల మాఫీ పథకం కింద పెండింగ్ వాయిదాల కోసం రుణదాత బ్యాంకులకు రూ.19,000 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించి నెలన్నరలోగా పూర్తి చేయాలన్నారు. రైతులకు రుణమాఫీపై ముఖ్యమంత్రి హామీని 100 శాతం నెరవేర్చేలా సెప్టెంబర్ 15 నాటికి మాఫీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలన్నారు. పంట రుణాల మాఫీ పథకం ద్వారా రైతులకు ఐదు విడతల్లో రూ.లక్ష వరకు ఉపశమనం కల్పించాలన్నారు సీఎం కేసీఆర్.
కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు చర్య ప్రభావం వల్ల ఏర్పడిన మందగమనం, కోవిడ్-19 మహమ్మారి వంటి అవాంతరాలు, కేంద్రం పక్షపాత వైఖరి, రాష్ట్రానికి రావాల్సిన ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను తగ్గించే లక్ష్యంతో ఏకపక్షంగా తీసుకున్న చర్యల కారణంగా కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు , రైతు బీమా, ఉచిత విద్యుత్ మరియు నీటిపారుదల సౌకర్యాల విస్తరణ వంటి రైతు అనుకూల పథకాలను విజయవంతంగా మరియు నిజాయితీగా కొనసాగిస్తోందని.. కష్టాలు, నష్టాలను లెక్కచేయకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో రాష్ట్రం వెనుకడుగు వేయలేదదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని, వ్యవసాయాభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే వరకు ప్రభుత్వం విశ్రమించదన్నారు. రుణమాఫీ వాయిదాలలో బ్యాంకులకు పాక్షికంగా చెల్లించడం ద్వారా ప్రభుత్వం రైతులకు ఇప్పటికే ఉపశమనం కల్పించిందన్నారు.