రాహుల్ గాంధీపై అనర్హతా వేటు, ఏం జరగాలి, ఏం జరిగింది, కాంగ్రెస్ నేత ముందు ఇప్పుడున్న మార్గాలేంటి!
ఎవరికి ఇష్టమున్నా లేకున్నా దేశంలో బీజేపీకి అత్యధిక రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆపార్టీలో ఏ పదవి ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీనే ప్రధాన నాయకుడు. దేశంలో మోడీ తర్వాత అత్యధిక ఇమేజ్ ఉన్న నేత కూడా రాహుల్ గాంధీనే. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ మీద పార్లమెంట్ సెక్రటేరియేట్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా చెప్పుకునే చోట ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్ నుంచి పంపించేయడం హాట్ టాపిక్ అవుతోంది.
సూరత్ కోర్టు ఇచ్చి న తీర్పు ఆధారంగా ఆఘమేఘాల మీద రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారు. దాంతో ఈ విషయం మీద విపక్షాలు భగ్గుమంటున్నాయి. అప్రజాస్వామిక చర్యగా పేర్కొంటున్నాయి.
అసలేం జరిగింది…
గత సాధారణ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా చౌకీదార్ ఛోర్ హై అంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ జరిగింది. రాఫెల్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిలో మోడీ భాగస్వామి అంటూ విమర్శలు చేశారు. ఆ సమయంలోనే రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో నేరగాళ్లకు మోడీ ఇంటిపేరు ఎందుకుంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మోడీ అవినీతి మీద గురిపెట్టి నీరవ్ మోడీ వంటి బ్యాంకులను ముంచిన మోసగాళ్లు, లలిత్ మోడీ వంటి అవినీతిపరులను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీని కూడా ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వ్యాఖ్యల మీద బీజేపీకి చెందిన , మోడీ స్వరాష్ట్ర నేత సూరత్ కోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ పూర్తయ్యి , తీర్పు వెలువడింది. రాహుల్ గాంధీపై నమోదయిన పరువు నష్టం కేసులో ఆయన్ని దోషిగా తేల్చారు. రెండేళ్ల కారాగార శిక్ష విధించారు. దానిని ఆధారంగా చేసుకుని పార్లమెంట్ సెక్రటేరియేట్ హుటాహుటీన రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ సీటుని ఖాళీగా పేర్కొంది.
ఏం జరగాలి..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102,103లో సభ్యుల అనర్హత గురించి ప్రస్తావించారు. సహజంగా పార్టీ ఫిరాయింపులు, విప్ లు ధిక్కరించే సందర్భంలో ఈ అనర్హత వేటు ముందుకొస్తుంది. అంతేగాకుండా ఆర్టికల్ 102 సెక్షన్ 2లో పేర్కొన్న నేరాల్లో నిరూపితమయ్యి శిక్ష పడినా అనర్హత వర్తిస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న నేరాల్లో హత్య, అత్యాచారం, అవినీతి, టెర్రరిజం, డ్రగ్స్, దేశ సమగ్రతకు భంగం కలిగించడం వంటి కేసులను ప్రస్తావించారు. ఆయా కేసుల్లో శిక్ష పడిన వారికి అనర్హత వర్తిస్తుంది.
కానీ రాహుల్ గాంధీకి అలాంటి నేరాల్లో శిక్ష పడిన దాఖలాలు లేవు. కేవలం ఐపీసీ 499,500 సెక్షన్ల కింద పరువు నష్టం కేసులో శిక్ష పడింది. అందులోనూ ఆ సెక్షన్ల కింద గరిష్టంగా పడే శిక్ష రెండేళ్లు. దానినే రాహుల్ గాంధీకి వర్తించారు.
ఇక ఆర్టికల్ 102 సెక్షన్ 3లో పేర్కొన్న అంశాల ప్రకారం ఏదయినా కేసులో రెండేళ్లకు మించి శిక్ష పడితే ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు. అది కూడా తక్షణమే చర్యలు అని రాజ్యాంగంలో లేదు. అనర్హుడిగా ప్రకటించాలి అని మాత్రమే ఉంది. ఆ తర్వాత సెక్షన్ 4లో పార్లమెంట్ సభ్యులకు 3నెలల మినహాయింపు ఉండేది. కానీ దానిని 2013లో తొలిగించారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం పరువు నష్టం వంటి కేసుల్లో రెండేళ్ల శిక్ష పడిన ఎంపీకి అనర్హత వేటు వర్తించాలంటే దానికి ఒక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ రాహుల్ విషయంలో అలాంటివి జరగలేదు. ఉన్నపళంగా ఆయన్ని దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడిన 24గంటల్లనే అనర్హత వేటు వేసేశారు.
రాహుల్ దారెటు
తాజా పరిణామాల ప్రకారం రాహుల్ గాంధీకి ఊరట లభించేందుకు న్యాయపరమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సూరత్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేయడం. నిజానికి శిక్ష విధించిన కోర్టు కూడా దానిని అమలు నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు గాను రాహుల్ గాంధీకి 30రోజులు గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే సూరత్ కోర్టు శిక్ష అమలులోకి రాకముందే పార్లమెంట్ సెక్రటేరియట్ స్పందించినట్టు స్పష్టమవుతోంది.
సూరత్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తే రాహుల్ కి ఉపశమనం దక్కుతుంది. కేసులో స్టే దక్కకపోయినా పరువు నష్టం కేసులో వేసేందుకు అవకాశం ఉన్న గరిష్ట శిక్ష విధించారు కాబట్టి అందులో ఒక్క రోజు శిక్ష తగ్గించినా రాహుల్ కి అనర్హత వర్తించదు. అదే సమయంలో ఆయన దోషిగా ప్రకటించినా, శిక్ష అమలుని సస్ఫెండ్ చేసినా రాహుల్ కి లైన్ క్లియర్ అవుతుంది.
అదే సమయంలో రాహుల్ మరో న్యాయపోరాటానికి కూడా మార్గం ఉంది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102,103కి భిన్నంగా పార్లమెంట్ సెక్రటేరియేట్ తన పట్ల స్పందించిదని ఆయన పోరాడేందుకు మార్గం ఉంది. అనర్హత వేటు ఉత్తర్వులను సవాల్ చేయవచ్చు. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఉపశమనం దక్కేందుకు ఛాన్స్ ఉందనే అభిప్రాయం న్యాయవర్గాల నుంచి వినిపిస్తోంది. పార్లమెంట్ సెక్రటేరియేట్ నిబంధలను అనుసరించకపోవడంతో రాహుల్ కి మార్గం సుగమం కావచ్చని చెబుతున్నారు.
రాహుల్ కి మేలు చేస్తుందా
దేశంలో మోడీకి తగిన ప్రత్యర్థిగా ఎదిగేందుకు రాహుల్ చాలా శ్రమిస్తున్నారు. భారత్ జోడో యాత్ర వంటివి ఆయనకు కొంత మేలు చేశాయి. అదే సమయంలో తాజా పరిణామాల ద్వారా రాహుల్ గాంధీ మరింతగా ఎమర్జ్ అయ్యేందుకు అవకాశం కనిపిస్తోందనే అంచనా ఉంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొందరపాటు చర్యగా సోషల్ మీడియాలో ఇప్పటికే మోడీ మద్ధతుదారులు సైతం స్పందిస్తున్నారు. దాంతో అది రాహుల్ కి సానుకూలంగా పరిణమించే అవకాశం ఉంది.
అయితే న్యాయపరమైన అంశాల్లో రాహుల్ కి ఊరట దక్కకపోతే ఆయన రాజకీయ భవితవ్యం అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా 2024కి మాత్రమే కాకుండా 2029కి ఆయన పోటీలో నిలిచే అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుతం రాహుల్ కి చావోరేవో స్థితిగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన తన చాకచక్యాన్ని వినియోగించుకుంటే మోడీకి బలమైన పోటీకి సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ని రక్షణలో పడేసేందుకు మోడీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా కొందరు భావిస్తున్నారు. కానీ అదే సమయంలో బీజేపీ నాయకత్వం డిఫెన్స్ లో ఉన్నట్టు తాజాగా ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వంటి వారి వ్యాఖ్యలు చాటుతున్నాయి. ఓబీసీలను రాహుల్ గాంధీ అవమానించారంటూ నడ్డా అనడం ఆపార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది. రాహుల్ కి సానుభూతి రాకుండా కులం కార్డు ముందుకు తెచ్చినట్టు స్పష్టమవుతోంది.
రాజకీయంగా ఈ పరిస్థితి కాంగ్రెస్ కి అనుకూలంగా మారాలంటే చట్టపరమైన అంశాలను సద్వినియోగం చేసుకోవాలి. న్యాయపరంగా ఉన్న మార్గాలను సుగమం చేసుకోవాల్సి ఉంటుంది.